గ్రామ దేవతలకు ఘనంగా ఆషాఢ సారె
పాలకోడేరు, ఆంధ్రప్రభ: పాలకోడేరు మండలం గరగపర్రులో కొలువై ఉన్న పల్లాలమ్మ, బర్రింకలమ్మ అమ్మవార్లకు గ్రామ భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. ముందుగా గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆషాఢ సారెను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా ఆషాఢ సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు, ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
