ఘనంగా ప్రారంభమైన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

జైనూర్ (ఆంధ్రప్రభ): కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లోని ఆదివాసీ గ్రామాల్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్లవాయి గ్రామంలో సర్పంచ్‌ కనక ప్రతిభ, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కొమురం భీం, వెరియర్‌ ఎల్విన్‌, హైమన్‌డార్ఫ్‌ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ‘జల్‌, జంగల్‌, జమీన్‌’ కోసం కొమురం భీం చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తుచేశారు. అప్పటి నిజాం ప్రభుత్వం ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ దంపతులను ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీలోని మార్లవాయి ప్రాంతానికి పంపిందని, వారు ఆదివాసీల స్థితిగతులను అధ్యయనం చేసి చేసిన కృషి ఫలితంగా వారి హక్కులకు గుర్తింపు లభించిందని తెలిపారు. జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లోని ఆదివాసీ గ్రామాల్లో సంప్రదాయ రీతిలో వేడుకలు నిర్వహిస్తూ ఆదివాసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.