కొల్లేరులో కలప దందా..
మండవల్లి, ఆంధ్రప్రభ : కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ వృక్ష సంపదకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం మనుగునూరు పరిధిలోని కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో పెరిగిన తుమ్మ చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా నరికివేసి కలపగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెట్ల నరికివేత.. కలప తరలింపు
కొల్లేరు పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పెరిగిన తుమ్మ చెట్లను నరికివేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చెట్లను నరికిన అనంతరం కొమ్మలు, దుంగలను వేరు చేసి కలపగా మార్చి వాహనాల్లో తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా ఈ తరహా కలప వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టన్ను రూ.6 వేల వరకు విక్రయం?
నరికిన తుమ్మ కలపను టన్ను సుమారు రూ.6 వేల వరకు విక్రయిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వృక్ష సంపదను అక్రమంగా నరికివేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కలప విక్రయాలకు సంబంధించిన వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
అధికారుల నిఘా ఏది?
కొల్లేరు ప్రాంతంలోని ప్రభుత్వ వృక్ష సంపదను పరిరక్షించాల్సిన అధికారులు అక్రమ నరికివేతలపై నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల్లో చెట్లను నరికివేసి తరలిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొల్లేరు పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ వృక్ష సంపద పరిరక్షణకు అధికారులు తక్షణమే స్పందించి ఆరోపణలపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే చెట్ల నరికివేత, కలప తరలింపు వెనుక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
