యూపీఐపై ఛార్జీలు ఉండవు.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు ఛార్జీలు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సామాన్య ప్రజలు నిర్వహించే వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా వ్యాపార సంస్థలతో చేసే అత్యధిక యూపీఐ లావాదేవీలకు కూడా ప్రస్తుతం ఎలాంటి రుసుము ఉండదని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధించినా.. అది అన్ని యూపీఐ లావాదేవీలకు వర్తించదని ప్రభుత్వం తెలిపింది. నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని ఎంపిక చేసిన వాణిజ్య లావాదేవీలకు మాత్రమే నామమాత్రపు ఎండీఆర్ విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై ప్రస్తుతం వర్తించే రుసుములతో పోలిస్తే ఈ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపింది.
యూజర్లకు భారం ఉండదు
స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపడం, ఇతర వ్యక్తిగత చెల్లింపులు వంటి పీ2పీ లావాదేవీలకు ఎలాంటి రుసుము ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే చిన్న వ్యాపారులు, సాధారణ దుకాణాల్లో జరిగే అత్యధిక వాణిజ్య లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగనున్నాయి.
దీంతో యూపీఐ ద్వారా రోజువారీగా చెల్లింపులు చేసే సామాన్య వినియోగదారులపై నేరుగా ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఎందుకు చట్ట సవరణ?
యూపీఐ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం భారీగా పెట్టుబడులు అవసరమవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలం బలంగా, సురక్షితంగా కొనసాగించేందుకు చట్ట సవరణను ఒక అవకాశం కల్పించే నిబంధనగా తీసుకొచ్చినట్లు వివరించింది.
కేవలం ప్రభుత్వ రాయితీలపై ఆధారపడటం ద్వారా భవిష్యత్తులో యూపీఐ వ్యవస్థను విస్తరించడం సాధ్యం కాదని, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేలా స్వయం సమృద్ధి కలిగిన ఆదాయ నమూనా అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఛార్జీలు ఎవరికి?
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విధానం అమల్లోకి వచ్చినా.. ప్రతి యూపీఐ చెల్లింపుపై ఎండీఆర్ విధించే అవకాశం లేదు. నిర్దిష్ట పరిమితి దాటిన ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకే పరిమితంగా రుసుము విధించే అవకాశం ఉంది. ఎండీఆర్ వ్యాపార సంస్థలపై విధించే రుసుము కాగా.. ప్రస్తుతం వినియోగదారుల నుంచి నేరుగా యూపీఐ లావాదేవీ రుసుము వసూలు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్
యూపీఐపై ఛార్జీల అంశం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. వినియోగదారులపై నేరుగా రుసుము విధించకపోయినా, వ్యాపారులపై ఎండీఆర్ భారం పడితే వారు పరోక్షంగా ఆ ఖర్చును వినియోగదారులపై మోపే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హామీలకంటే చట్టపరమైన రక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం యూపీఐని సామాన్యులకు ఉచితంగా కొనసాగించాలన్నదే తమ విధానమని స్పష్టం చేసింది. విదేశీ ఒత్తిళ్ల కారణంగా ఈ మార్పులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. యూపీఐ భారతదేశ సొంత ఆవిష్కరణ అని, దాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొంది.
