మస్కి చెరువు పరిరక్షణకు కదిలిన స్థానికులు
- ఏ.వీ. రంగనాథ్, హైడ్రాకు మద్దతుగా సంఘీభావం
- చెరువు పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మస్కి చెరువు పరిరక్షణ, అభివృద్ధి, ప్రజా ఆస్తుల రక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఏ.వీ. రంగనాథ్‌కు సంఘీభావంగా శనివారం స్థానికులు ప్రజా ర్యాలీ నిర్వహించారు. సాయి గౌతమ్ కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ పెంటయ్య కాలనీ, గీతాంజలి వేదిక్ స్కూల్ మీదుగా మస్కి చెరువు వరకు కొనసాగింది.
ర్యాలీలో సాయి గౌతమ్ కాలనీ, ఖులీ ఖుతుబ్షా కాలనీ, పెంటయ్య కాలనీలకు చెందిన ప్రజలతో పాటు హాల్‌మార్క్ విసినియా, మై హోమ్ అవతార్, ఆర్కిడ్ అపార్ట్మెంట్స్, ఐడియల్ లేక్ అపార్ట్మెంట్స్ నివాసితులు, సంకటహరణ హనుమాన్ ఆలయ సభ్యులు, ప్రకృతి ప్రేమికులు, చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మస్కి చెరువు పరిరక్షణ, అభివృద్ధికి మద్దతుగా పాల్గొన్నవారు నినాదాలు చేశారు. ఏ.వీ. రంగనాథ్, హైడ్రాకు మద్దతుగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మస్కి చెరువు పరిరక్షణతో పాటు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశాన్ని విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గౌరవ హైకోర్టు పరిగణించాలని ర్యాలీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. చెరువుల పరిరక్షణ పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మస్కి చెరువు పరిరక్షణ, పర్యావరణ రక్షణ, ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
