పాప కిడ్నీ ఆపరేషన్‌కు రూ.2 లక్షల సాయం

  • మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నాని
  • చికిత్స ఖర్చు భరిస్తూ అండగా నిలిచిన ప్రజాప్రతినిధి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులతో ఏ చిన్నారికి వైద్యం దూరం కాకూడదనే మానవతా దృక్పథంతో కౌన్సిలర్‌ కొత్తపల్లి శ్రీకాంత్‌ నాని ముందుకొచ్చారు. పాప కిడ్నీ ఆపరేషన్‌కు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని జూలై 26న ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆయన సహకారంతో పాపకు విజయవంతంగా కిడ్నీ ఆపరేషన్‌ నిర్వహించారు.

చికిత్స పూర్తయిన అనంతరం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల విలువైన చెక్కును పాప చేతుల మీదుగా వైద్యులకు అందజేశారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స ఎక్కడా నిలిచిపోకుండా ఖర్చును భరించిన కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నానిని స్థానికులు అభినందించారు.

కుటుంబంలో ఆనందం

ఆపరేషన్‌ అనంతరం పాప ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. ఆపద సమయంలో అండగా నిలిచి చికిత్సకు సహాయం చేసిన కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నానికి పాప నాయనమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆపరేషన్‌ అనంతరం కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నాని పాపను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పాపను ఇంటికి పంపించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ నాని మాట్లాడుతూ పేద కుటుంబాలకు డబ్బు సమస్య కారణంగా వైద్యం దూరం కాకూడదన్నారు. అవసరమైన సమయంలో మనకు చేతనైనంత సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పాప త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

చిన్నారి చికిత్సకు కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నాని అందించిన ఆర్థిక సహాయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.