Indrakeeladri | అమ్మవారికి పవిత్ర ఆషాఢ సారె…
సమర్పించేందుకు పోటెత్తిన మహిళా భక్తులు
25వ రోజు కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తజన సందడి
59 సారె బృందాలు.. 21,342 మంది భక్తుల రాక
రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన మహిళలు..
సారె బృందాలకు ఉచిత దర్శనం
పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి ఘన సమర్పణ
భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ..
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ): శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారెలతో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న మహిళా భక్తులతో శనివారం కొండపై భక్తి సందడి నెలకొంది. ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం 25వ రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో అమ్మవారి సన్నిధి కిక్కిరిసింది. శనివారం 59 సారె బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆయా బృందాల్లో 21,342 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా భక్తులు సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారె సామగ్రిని తీసుకొచ్చి కనకదుర్గమ్మకు సమర్పించారు.

సారె బృందాల్లోని భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత దర్శనం, అమ్మవారి ఆశీర్వచనం కల్పించడంతో పాటు సారె సమర్పణకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాలను అందించారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ స్వయంగా సారె బృందాల సభ్యులకు ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించే సంప్రదాయానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని దేవస్థానం అధికారులు తెలిపారు. మహిళా భక్తుల భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
