రాంపూర్ ప్రజల కన్నీటి నివాళి..
9వ రోజు కార్యక్రమంలో వెల్లువెత్తిన ఆత్మీయత
సంతాప సూచికగా మహా అన్నదానం
ప్రజల మనిషిగా పెద్ది సుదర్శన్‌రెడ్డిని స్మరించుకున్న గ్రామస్థులు
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: ఒక మనిషి వెళ్లిపోవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న మనిషి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ వెళ్లిపోవు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి విషయంలో రాంపూర్ ప్రజల ఆత్మీయత ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
పెద్ది సుదర్శన్‌రెడ్డి 9వ రోజు కార్యక్రమంలో రాంపూర్ గ్రామానికి చెందిన నాయకులు, ప్రజలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. “పెద్ది అన్నా.. మీరు మాకు దూరమైనా, మా జ్ఞాపకాల నుంచి మాత్రం ఎప్పటికీ దూరం కాలేరు” అంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, అవసరమైన సమయంలో అండగా నిలిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలను పలువురు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పదవులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కలిసిపోయిన ఆయన ‘పెద్ది అన్న’గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
కన్నీటి నివాళుల మధ్య 9వ రోజు కార్యక్రమం:
బీఆర్ఎస్ రాంపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్టెకోల సోమన్నగౌడ్, గ్రామ సర్పంచ్ పురం భాస్కర్, ఉప సర్పంచ్ గుజ్జ భారతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్‌రావు, ప్రభాకర్‌రావు, గుజ్జ సంపత్‌రావు, మాజీ సర్పంచ్ చింతపట్ల సురేష్‌రావు, మాజీ ఉప సర్పంచ్ గాదం రాజకుమార్, మేడపల్లి మాజీ సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అన్నదానంతో అభిమానానికి మరో రూపం:
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతికి సంతాప సూచికగా బీఆర్ఎస్ పార్టీ రాంపూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 7 గంటలకు యశోద ఫంక్షన్ హాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పెద్ది అన్న భౌతికంగా లేకపోయినా.. ఆయన పలకరింపు, ఆత్మీయత, చేసిన సేవలు రాంపూర్ ప్రజల జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు.
“అన్నా.. నీ అడుగు జాడల్లో జ్ఞాపకాలు.. నీ సేవల్లో మా జ్ఞాపకాలు.. మా గుండెల్లో ఎప్పటికీ నువ్వే.. పెద్ది అన్నా!”
