పైడిపల్లి పీహెచ్సీలో డీఎంహెచ్ఓ తనిఖీ
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ: పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏఆర్వీ, ఏఎస్వీ వ్యాక్సిన్ల లభ్యత, నిల్వ విధానం, వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, డ్రై డే, ఫీవర్ సర్వేలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం పైడిపల్లి పీహెచ్సీ పరిధిలోని సబ్సెంటర్లో నిర్వహిస్తున్న ఔట్రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించారు. టీకాల నమోదు వివరాలు, సేవల నిర్వహణను తనిఖీ చేసి, అర్హులైన పిల్లలు, గర్భిణీలకు సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా సమన్వయంతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి డా. రాజారెడ్డి సూచించారు.
