రైజ్ రెక్కలతో మహిళల విజయ విహంగం…
విజయవంతంగా నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లు
గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్‌గా ఎదుగుతున్న ప్రత్యేక కేంద్రం
శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు, జాబ్‌మేళాల నిర్వహణ
5 వేల మందికి చేరువైన రైజ్ కేంద్రం కార్యకలాపాలు
ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త దార్శనికత దిశగా అడుగులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైజ్ కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పోను కలెక్టర్ శనివారం సందర్శించారు. రైజ్ కేంద్రం చేయూతతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్ల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన 27 స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తూ రైజ్ కేంద్రం ఒక ప్రత్యేక గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్‌గా ఎదుగుతోందని చెప్పారు.
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ముఖ్యమంత్రి దార్శనికత అయిన ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త మైలురాయిని చేరుకునేందుకు రైజ్ కేంద్రం కీలక ముందడుగుగా నిలుస్తోందన్నారు. ఈ కేంద్రంలో ప్రతిరోజూ శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం వర్క్‌షాప్‌లు, ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఇప్పటికే 30 వర్క్‌షాపులు నిర్వహించామని, ఐదు వేల మంది మహిళలకు చేరువయ్యామని చెప్పారు. వీరిలో ఇప్పటికే చాలామంది పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకెళ్తున్నారన్నారు.

ఆలోచన నుంచి ఆచరణ వరకు…
రైజ్ కేంద్రం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకునేలా ప్రోత్సహించడంతో పాటు, చిన్న స్థాయి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. మైక్రో, మినీ ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి వాటిలో స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న మహిళల విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా రైజ్ కేంద్రం దోహదపడుతోందన్నారు.
మహిళల ఆర్థిక సాధికారత.. కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. స్థానికంగా లభించే వనరులు, నైపుణ్యాలు, మహిళల సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్‌పై దృష్టి సారించేలా చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలతో అనుసంధానం కల్పిస్తూ వారి యూనిట్లు స్థిరంగా అభివృద్ధి చెందేలా రైజ్ తోడ్పాటునందిస్తున్నట్లు వివరించారు. సమాజంలో పారిశ్రామికరంగంలో విజయవంతంగా ముందుకెళ్తున్న ఎందరో మహిళలు మార్గదర్శులుగా వ్యవహరిస్తూ పీ4 స్ఫూర్తిని చాటి చెబుతున్నారని, రిసోర్స్ పర్సన్స్‌గా సేవలందిస్తున్నారని వివరించారు.

ఏఐ వంటి ఆధునిక సాంకేతికతపైన…
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చి, నైపుణ్యాలు అభివృద్ధి చేసి మహిళలు మంచి ఉద్యోగాలు పొందడం రైజ్ కేంద్రం విజయానికి ప్రతీక అని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ), ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ తదితరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఒక నైపుణ్యం ఉండాలి.. ఆ నైపుణ్యం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ కూడా మద్దతిస్తోందన్నారు. స్థానిక శాసనసభ్యుడు, ఎంపీ కూడా ఈ కేంద్రానికి చేయూతనందిస్తున్నారని.. డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖల సమన్వయంతో ఈ కేంద్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఔత్సాహిక మహిళలు ఎవరైనా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, డీపీఎం ఎ.శ్రీనివాసరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని, తదితరులు పాల్గొన్నారు.
