పెళ్లి కోసం పోలీస్ వేషం..

పోలీస్‌ అధికారినంటూ నమ్మించి పెళ్లి..
డ్యూటీ రోస్టర్‌ తనిఖీతో బాగోతం బట్టబయలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మంచి కుటుంబానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మహిళ ఏకంగా పోలీస్‌ వేషం వేసింది. తాను పోలీస్‌ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నానంటూ కొంతకాలం నమ్మించింది. చివరకు ఆమె వెంట తీసుకెళ్లే టిఫిన్‌ బాక్సే అసలు గుట్టును బయటపెట్టింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.

మాలేవాలా గ్రామానికి చెందిన కోమల్‌ప్రీత్ కౌర్ తాను పోలీస్‌ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లు చెప్పుకునేది. మంచి కుటుంబానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్‌ వేషం వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె కోరుకున్నట్లుగానే నెల రోజుల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అసలు విషయం బయటపడకుండా పెళ్లి తర్వాత కూడా పోలీస్‌ వేషధారణను కొనసాగించింది.

తాను విధులకు వెళ్తున్నట్లు భర్తను నమ్మించేందుకు కోమల్‌ప్రీత్‌ ప్రతిరోజూ టిఫిన్‌ బాక్సును వెంట తీసుకెళ్లేది. మోగా సిటీ-1 పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంజ్ కేంద్రం వద్ద టిఫిన్‌ బాక్సును పెట్టేది. అక్కడ నిజమైన పోలీసులు కూడా తమ టిఫిన్‌ బాక్సులు పెట్టేవారు. ఈ క్రమంలో వారితో పరిచయం పెంచుకున్న ఆమె.. తాను ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నట్లు చెప్పేది.

డ్యూటీ రోస్టర్‌తో అడ్డంగా దొరికింది..

అయితే కోమల్‌ప్రీత్‌ వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె వివరాలను పరిశీలించడంతో పాటు డ్యూటీ రోస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో ఆమె పేరు కనిపించలేదు. దీంతో అనుమానం మరింత బలపడింది. ఆమెను ప్రశ్నించగా ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతూ దాదాపు రెండు నెలల పాటు తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో ఆమె నకిలీ పోలీస్‌గా తేలింది.

దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నకిలీ పోలీస్‌ వేషధారణ, ఫోర్జరీ, అధికారిక గుర్తుల దుర్వినియోగం తదితర అభియోగాలపై దర్యాప్తు చేపట్టారు. పెళ్లి కోసం పోలీస్‌గా మారిన ఆమెను చివరకు పోలీసులే గుర్తించి పట్టుకోవడం ఈ ఘటనలో ఆసక్తికర పరిణామంగా మారింది.