రేపు నర్సంపేటకు కేసీఆర్…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నర్సంపేటకు వెళ్లనున్నారు. ఆదివారం (ఆగస్టు 9) నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి కేసీఆర్ చేరుకోనున్నారు.
పార్టీ స్థాపించిన నాటి నుంచి బీఆర్‌ఎస్ కోసం నిబద్ధతతో పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో విషాదంలో ఉన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అదే సమయంలో నర్సంపేట నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులను కేసీఆర్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
ఇప్పటికే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్.. పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
