మోసపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి..

  • బేర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి..
  • సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య..
  • బి.కె.యం.యు.,జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు..

ఏలూరు, ఆంధ్రప్రభ : లింగపాలెం మండలం బోగోలు శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను నష్టాలపాలు చేసిన మొక్కజొన్న విత్తన కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

వారి వివరాల ప్రకారం.. లింగపాలెం మండలం మఠంగూడెంకు చెందిన కొల్లు మురళి, వెంకటాపురం రైతులకు బేర్ కంపెనీకి చెందిన డీ-589 మొక్కజొన్న విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయని చెప్పినట్లు తెలిపారు. బేర్ కంపెనీతో సంబంధాలు ఉన్న రామచంద్రపురానికి చెందిన మన్నే ప్రసాద్, మన్నే రామకృష్ణ ద్వారా రైతులకు విత్తనాలు ఇప్పించినట్లు పేర్కొన్నారు.

విత్తనాలు అందించే సమయంలో ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.30 వేల చొప్పున కంపెనీ కొనుగోలు చేస్తుందని రైతులను నమ్మించినట్లు తెలిపారు. ఒకవేళ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోతే ఎకరానికి రూ.లక్ష చొప్పున కంపెనీ పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఈ హామీలను నమ్మి వెంకటాపురానికి చెందిన సుమారు 18 మంది రైతులు 64 ఎకరాల్లో బేర్ కంపెనీకి చెందిన డీ-589 మొక్కజొన్న విత్తనాలను సాగు చేసినట్లు తెలిపారు. ఎకరానికి నాలుగు టన్నుల చొప్పున మొత్తం 64 ఎకరాల్లో సుమారు 256 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 65 టన్నుల 9 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

దిగుబడి తగ్గడంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన విత్తన పంపిణీదారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కృష్ణ చైతన్య, వెంకటేశ్వరరావు తెలిపారు. నష్టపోయిన రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులేనని, పంట నష్టంతో కౌలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

తమకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత రైతులు 2025 అక్టోబర్‌ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం దారుణమని వారు అన్నారు. దాదాపు పది నెలలుగా రైతులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని, రైతులకు విత్తనాలు సరఫరా చేసిన మన్నే ప్రసాద్, మన్నే రామకృష్ణలపై చర్యలు తీసుకోవడంతో పాటు బేర్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

మొక్కజొన్న విత్తన కంపెనీల తీరుపై ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. రైతులను మోసం చేసి నష్టాలపాలు చేస్తున్న విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కృష్ణ చైతన్య, వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.