మూలాలను మరువొద్దు.. మత్తులో పడొద్దు!
ఎంఎస్‌ఆర్ ప్రబోధ సుమేర్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
బాల్కొండ పాఠశాలలో ఘనంగా వ్యక్తిత్వ వికాస సదస్సు
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): మనిషి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను ఎన్నటికీ మరువకూడదని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రముఖ రచయిత, కవి, యువ సలహాదారు, ప్రబోధ సంస్థ జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు ఎంఎస్‌ఆర్ ప్రబోధ సుమేర్ సూచించారు.
భీమ్‌గల్‌లోని టీజీఎంఆర్‌ఈఐఎస్ బాల్కొండ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణాత్మక, వ్యక్తిత్వ వికాస సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇదే పాఠశాలలో తొలి బ్యాచ్ విద్యార్థిగా చదువుకున్న ప్రబోధ సుమేర్.. తన బాల్య జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకుంటూ వారిలో స్ఫూర్తిని నింపారు.
మూలాలను మరువొద్దు
తల్లి గర్భం నుంచి భూతల్లి ఒడిలోకి వచ్చామని, ఈ భూమి, మనం ఒకే తల్లి బిడ్డలమని ప్రబోధ సుమేర్ అన్నారు. మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడి నుంచి వచ్చామనే విషయాలను ఎప్పటికీ మర్చిపోకుండా మూలాలను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యే భవిష్యత్తుకు పునాది
విద్యే ఉత్తమ భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆయన అన్నారు. కష్టపడి చదివిస్తూ తమ భవిష్యత్తు కోసం తపించే తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పే గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడేలా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
మత్తుకు దూరంగా ఉండాలి
ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని ప్రబోధ సుమేర్ హెచ్చరించారు. వ్యసనాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వ్యక్తి భవిష్యత్తును, కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయని తెలిపారు. సమాజంలో గౌరవంగా జీవించాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ
మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రబోధ సుమేర్ ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.
గురువులకు కృతజ్ఞతలు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలవడంతో పాటు 43కి పైగా పుస్తకాలు రచించడానికి తన పాఠశాల గురువుల మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని ప్రబోధ సుమేర్ తెలిపారు. తనకు ఎంతో అనుబంధం ఉన్న ‘రెండో ఇంటికి’ తిరిగి వచ్చి విద్యార్థులతో తన అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించిన పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
తమ పాఠశాలలో తొలి బ్యాచ్‌లో చదువుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనంతరం తిరిగి పాఠశాలకు వచ్చిన ప్రబోధ సుమేర్‌ను ప్రిన్సిపాల్, ఆయన పాత గురువులు, ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొన్నారు.
