ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు
- 22 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు
- కీలక శాఖల్లో భారీ మార్పులు
అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) జారీ చేసిన G.O.Rt.No.1539 ప్రకారం మొత్తం 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సర్వీసెస్ & హెచ్ఆర్ఎం)గా ఉన్న షంషేర్ సింగ్ రావత్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేయగా, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జె. శ్యామలరావును నియమించారు.
పాఠశాల విద్య కార్యదర్శిగా ఉన్న కోన శశిధర్‌ను రవాణా, రోడ్లు & భవనాల (TR&B) శాఖ కార్యదర్శిగా నియమించారు. ఎం. శివప్రసాద్ (IFS)ను ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుండి అమ్రపాలి కటాను తప్పించారు; తదుపరి నియామకం కోసం సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాలని ఆమెను ఆదేశించారు. ఆమె స్థానంలో పట్టణశెట్టి రవి సుభాష్‌ను APTDC కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్‌కు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్య కమిషనర్ డా. నారాయణ భరత్ గుప్తాను గోదావరి పుష్కరాల జాయింట్ ప్రత్యేక అధికారిగా నియమించారు.
అలాగే ప్రఖర్ జైన్‌ను విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) కమిషనర్‌గా, గీతాంజలి శర్మను ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ ఎండీగా, ఎం. జయకృష్ణను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.
టీటీడీలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. డా. ఏ. శరత్‌ను జాయింట్ ఈవోగా కొనసాగించగా, ప్రభల గోపీనాథ్‌ను ఆరోగ్య, విద్య విభాగాల జాయింట్ ఈవోగా నియమించారు.
అదేవిధంగా గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం, పురావస్తు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ తదితర శాఖల్లోనూ పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
