మెగా డీఎస్సీపై అయోమయం సృష్టించొద్దు: గుడిసె ఆది కృష్ణమ్మ

  • ఉద్యోగాలపై పూర్తి భరోసా కూటమి ప్రభుత్వానిదే
  • కర్నూలులో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అయోమయానికి గురిచేయడం మానుకోవాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అన్నారు. కర్నూలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు యాదవ్‌తో కలిసి ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని తెలిపారు.

పరీక్షల నిర్వహణ నుంచి నియామకాల వరకు ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించిందని, ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే సుమారు తొమ్మిది నెలలుగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అమలుకు నిదర్శనమని చెప్పారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం చూసి జగన్ రెడ్డి అసహనంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఎలాంటి సందేహాలు లేకపోయినా వారి మనసుల్లో అనుమానాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. క్రీడాకోటా నియామకాల విషయంలో కూడా తొలుత పారదర్శకత లేదని ఆరోపించి, అనంతరం మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన యువత కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అదే జగన్ రెడ్డికి అసహనానికి కారణమైందని వ్యాఖ్యానించారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి, స్వశక్తితో ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగులను అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

ప్రజలు ఇప్పటికే తమ తీర్పును స్పష్టంగా ఇచ్చారని, ఆ తీర్పును గౌరవించాలని జగన్ రెడ్డికి సూచించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వారి ఉద్యోగాలకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసాగా నిలుస్తుందని గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు.

ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ధరూర్ జేమ్స్, ఎల్.వి. ప్రసాద్, పోతురాజు రవికుమార్, సత్రం రామకృష్ణుడు, కురువ ఎల్లప్ప, పేరపోగు రాజు, హనుమంతరావు చౌదరి, రామకృష్ణ, సయ్యద్ బాష తదితరులు పాల్గొన్నారు.