పారదర్శక నియామకాలతో క్రీడాకారులకు న్యాయం
- అమరావతి ఛాంపియన్షిప్-2026లో ఆదిరెడ్డి శ్రీనివాస్
- క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన “అమరావతి ఛాంపియన్షిప్-2026” కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ, రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
కార్యక్రమంలో 2025 డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయులుగా ఎంపికైన క్రీడాకారులని మర్యాదపూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తిగా ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తోందన్నారు. క్రీడాకారులు భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగేలా పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
రాజమహేంద్రవరంలో ఇటీవల ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, దీని ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం కల్పిస్తోందన్నారు.
యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

