చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • పాయకరావుపేటలో ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో మంత్రి అనిత
  • రూ.25 వేల ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్, పింఛన్‌తో అండగా నిలుస్తున్నాం

అనకాపల్లి, ఆంధ్రప్రభ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన “నేతన్న సేవలో” కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మమేకమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అని అన్నారు. అనకాపల్లి జిల్లాకు చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, నేతన్నల శ్రమ, నైపుణ్యాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నుంచి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి “నేతన్న సేవలో” పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 ఏళ్ల వయసుకే పింఛన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

చేనేత రంగంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, ఈ రంగంలో దాదాపు 70 శాతం మంది మహిళలే పనిచేస్తుండటం గర్వకారణం అని అనిత అన్నారు. మహిళా నేతన్నల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేటకు చెందిన నేతన్నలు స్వయంగా నేసిన చీరను మంత్రి అనిత కొనుగోలు చేశారు. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి నేతన్న కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.