డ్రైనేజీ సమస్యపై వ్యాపారులు, స్థానికుల ఆగ్రహం

శాశ్వత పరిష్కారం కోరుతూ బురద నీటిలో ఆందోళన

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి కృష్ణకాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై నెలకొన్న డ్రైనేజీ సమస్యకు నిరసనగా వ్యాపారులు, స్థానికులు శుక్రవారం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరినాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు.

అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతి వర్షానికి భారీగా నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, పాదచారులు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు.

అంతేకాకుండా, రహదారిపై నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాపార సంస్థలకు వచ్చే వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వ్యాపారులు పేర్కొన్నారు.

ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని నిరసనకారులు ఆరోపించారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, రోడ్డుపై నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.