ICAI |ఐసీఏఐ రీజినల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పయ్యావుల కేశవ్
ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం
మంగళగిరి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళగిరిలోని సి.కే. కన్వెన్షన్‌లో నిర్వహించిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 58వ రీజినల్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. పారదర్శక ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో వారి నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో అవసరమని తెలిపారు.
వ్యాపార రంగం అభివృద్ధి, పన్నుల వ్యవస్థలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.
ఐసీఏఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆర్థిక రంగానికి నిపుణులను అందించడమే కాకుండా, దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. యువ చార్టర్డ్ అకౌంటెంట్లు నూతన ఆలోచనలు, ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

