హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాయంత్రం 6.30 గంటల వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న నిపుణులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నల్గొండ, గద్వాల, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అదే సమయంలో రాత్రి వేళ తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
