Kandula Durgesh | విద్యార్థులకు మంత్రి కందుల దుర్గేష్ సందేశం

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: చదువుతో పాటు క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమాలు విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌సీ సౌత్ జోన్-1 బాలికల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2026 కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేరీ కోమ్, పీవీ సింధు, బాలాదేవి వంటి క్రీడాకారిణులు తమ ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచి మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారని, సరైన అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే మహిళలు ప్రతి రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు.

ఫుట్‌బాల్ క్రీడకు రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ ప్రాంతానికి చెందిన సుంకర భాస్కర్ రావు సహా ఎంతోమంది ప్రతిభావంతులు ఫుట్‌బాల్‌లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. అటువంటి ఘనమైన ఫుట్‌బాల్ చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం వేదికగా నేడు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ క్రీడాకారిణులతో ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్ జరగడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఫుట్‌బాల్‌కు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి ఎంతో అవసరమని తెలిపారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి 51 జట్లు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఫలితం ఏదైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా అలవడే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా క్రీడాకారిణులు అందరినీ ఆత్మీయంగా పలకరించి అభినందించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి ఫుట్‌ బాల్‌ ఆడారు.