నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు

ఆరోగ్య సేవల్లో రాజీ లేదు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ప్రతి ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉండాలి
పీహెచ్‌సీల నిర్మాణాలు వేగవంతం చేయాలి
మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ డాక్టర్ ఘటనపై తీవ్ర ఆగ్రహం

జోగిపేట ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడి స్థానంలో నకిలీ డాక్టర్ సేవలందించిన ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీసీహెచ్‌ఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లను వివరణ కోరుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్య రంగానికి కీలక సూచనలు

కంకోల్, సింగీతం పీహెచ్‌సీల ప్రారంభానికి చర్యలు వేగవంతం చేయాలని, బర్దిపూర్, సుల్తాన్‌పూర్, నేరడిగుంట పీహెచ్‌సీ భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ, పటాన్‌చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ ఎంసీహెచ్ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అధికారులు మంత్రికి వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందని, కంది, పటాన్‌చెరు, సంగారెడ్డి మండలాల్లో అల్పాహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జెడ్పీహెచ్‌ఎస్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి ఆదేశించారు.

సంక్షేమ హాస్టళ్లు, రేషన్ కార్డులపై సమీక్ష

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పనితీరును సమీక్షించిన మంత్రి.. భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్ల వివరాలు సేకరించాలని సూచించారు. అలాగే ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

తాగునీటి సరఫరాపై యాక్షన్ ప్లాన్

మంజీర, సింగూరు ప్రాజెక్టుల నీటి మట్టాలు, బోరంచ, భూచారెడ్డిపల్లి ఇంటెక్ వెల్‌ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరాపై మంత్రి ఆరా తీశారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.