Thailand | స్కూల్లో రక్తపాతం…

విద్యార్థి కాల్పుల్లో ఏడుగురు మృతి
సహ విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహిత కాల్పులు..
అనంతరం తనను తాను కాల్చుకున్న నిందితుడు


Thailand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : థాయ్‌ల్యాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నొంతగురి ప్రావిన్స్‌లోని బాంగ్ క్రువాయ్ జిల్లాలో ఉన్న డెబ్సిరిన్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ దారుణ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడి అనంతరం థాయ్ ఉప ప్రధాని అనుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రాథమిక దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్లే ముందు నిందిత విద్యార్థి తన ఇంట్లో ఉన్న తాత, బామ్మలను కూడా కాల్చి చంపినట్లు థాయ్ ప్రజారోగ్య మంత్రి వెల్లడించారు. కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం తుపాకీ అతని తాతకు చెందినదిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి తాత గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కాల్పుల వెనుక ఉన్న కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.