AP | మెడికోల ప్రమాదంపై సీఎం ఆగ్రహం…

నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం


AP | అమరావతి, ఆగస్టు 7, ఆంధ్రప్రభ : రాజమహేంద్రవరంలో ఇద్దరు మెడికోలను కారు ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనలో గాయపడిన మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు మెడికోలను ఢీకొట్టి నిందితులు పరారైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు. గాయపడిన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.