యువతను మింగేస్తున్న జూదం

పేకాట అడ్డాల వద్దే అన్ని సదుపాయాలు..!
భోజనం నుంచి మద్యం వరకు నిర్వాహకులే ఏర్పాట్లు
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వాహకులు
భీమ్‌గల్ మండలంలో యథేచ్ఛగా పేకాట కేంద్రాల‌ నిర్వహణ

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పలు గ్రామాలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో పేకాట అడ్డాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు పేకాట కేంద్రాలను ఏర్పాటు చేసి జూదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పేకాట ఆడేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ రోజంతా ఆటలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పేకాట అడ్డాల వద్దే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, నిర్వాహకులు భోజనం, తాగునీరు, సిగరెట్లు, మద్యం వంటి సౌకర్యాలను కూడా అందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దాడుల నుంచి తప్పించుకునేందుకు పేకాట కేంద్రాల చుట్టూ నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

భీమ్‌గల్ పట్టణంలోని కొన్ని నివాస గృహాలతో పాటు ముచ్కూర్ గ్రామ పరిసరాల్లోని చెరువులు, కుంటల వద్ద, పాడుబడిన ఇళ్లలో, పిప్రి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద నిర్మించిన గుడిసెల్లో, కుప్కల్ అటవీ ప్రాంతంలో, బడా భీమ్‌గల్ ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో పేకాట అడ్డాలు కొనసాగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామానికో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని జూదాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఉపాధి లేక ఖాళీగా తిరుగుతున్న కొందరు యువకులు ఈ పేకాటకు బానిసలుగా మారుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో జూదంలోకి అడుగుపెడుతున్న యువత చివరకు భారీగా డబ్బు కోల్పోయి అప్పుల పాలవుతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీని ప్రభావంతో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేకాట అడ్డాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిర్వాహకులతో పాటు జూదంలో పాల్గొనే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్రమ జూదాన్ని పూర్తిగా అరికట్టేందుకు నిరంతర నిఘాతో పాటు తరచూ దాడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు: ఎస్సై తిరుపతి

పేకాట ఆడుతున్న వారిపై సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భీమ్‌గల్ ఎస్సై తిరుపతి తెలిపారు. పేకాట నిర్వాహకులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, అక్రమ జూదాన్ని నిర్వహించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.