డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం వ్యూహాత్మకం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా అడుగులు
డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం వ్యూహాత్మకం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా అడుగులు
- డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక సమావేశాల యోచన
- మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం కేంద్రం కసరత్తు
- రాహుల్‌తో కిరణ్ రిజిజు కీలక భేటీ
- ప్రాంతీయ పార్టీల మద్దతుపై ప్రభుత్వ దృష్టి
- దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల నివృత్తికి ప్రయత్నాలు
నియోజకవర్గాల పునర్వర్గీకరణ (డీ-లిమిటేషన్) బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం వ్యూహం మార్చింది. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ వర్షాకాల సమావేశాలను చారిత్రక వేదికగా మార్చుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈసారి బిల్లును సభలో ఆమోదింపజేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంకోసం మూడింట రెండు వంతుల మెజారిటీని కూడగట్టేందుకు ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా కృషి చేస్తోంది.
ఈ బిల్లును మహిళా బిల్లుతో కలిపి ఆమధ్య ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించడం కారణంగా అది ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై కేంద్రం మళ్లీ ప్రతిపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బుధవారం నాడు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కలుసుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఈనెల 16 నుంచి 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు రాహుల్‌కు ఆయన చెప్పారు.
రాహుల్‌తో కేంద్ర మంత్రి 50 నిమిషాలకుపైగా చర్చలు జరిపారు. నీట్-యూజీ పేపర్ లీక్‌పై పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని కోరుతున్నట్టు రాహుల్ కేంద్ర మంత్రికి తెలిపారు. తాము అమిత్ షా రాజీనామా కోరడం లేదనీ, ఇందుకు సంబంధించిన వాస్తవాలను పార్లమెంటు ముఖంగా తెలియజేయాలని కోరుతున్నామని రాహుల్ కేంద్ర మంత్రి రిజిజుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
అయితే, కేంద్ర మంత్రి ప్రకటన చేయనిదే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది లేదని రాహుల్ నిష్కర్షగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అసలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే డీ-లిమిటేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేలా చూడాలని ముందు అనుకున్నప్పటికీ, కాక్రోచ్ పార్టీ ఆందోళన, విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలతో కాస్త వెనక్కి తగ్గింది.
ప్రస్తుత సమావేశాల పొడిగింపుగా కాకుండా, డీ-లిమిటేషన్ కోసం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కావడంతో ప్రస్తుత సమావేశాల పొడిగింపుగా కాకుండా, విడిగానే ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా విడిగా సమావేశాలు నిర్వహించడమే మంచిదని ప్రభుత్వం సంకల్పించింది. అయితే, రాహుల్ గాంధీ హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసి తీరాలని పట్టుపడుతున్నారు.
ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకు పార్లమెంటులో మెజారిటీ కూడగట్టే బాధ్యతను కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్. మురుగన్‌లకు ప్రధాని అప్పగించినట్టు తెలుస్తోంది.
వీరంతా ప్రతిపక్షాలతో సంయుక్తంగానూ, విడివిడిగానూ చర్చలు జరపనున్నట్టు తెలియవచ్చింది. డీ-లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర మంత్రులు కృషి చేయనున్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి, బిల్లుకు అవసరమైన మద్దతు సమీకరించాలన్నదే ప్రభుత్వ వ్యూహం.
