Supreme Court | విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి…

అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని సూచన


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

నిరసనల్లో పాల్గొన్నందుకు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొంది.

అలాగే నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఘటనలపై పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, పలుచోట్ల విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు తాజా మధ్యంతర ఉత్తర్వులు విద్యార్థులకు గణనీయమైన ఊరటగా మారాయి.