TRS | మహబూబాబాద్ పార్లమెంట్‌లో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేస్తాం
గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణంపై దృష్టి
TRS | నర్సంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రక్షణ సేన మహబూబాబాద్ పార్లమెంట్ బాధ్యుడిగా నియమితులైన డా. బోడ అనిల్ కుమార్ నాయక్ పార్టీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణను ప్రకటించారు. తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం, ములుగు నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టంగా నిర్మించి, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదర్శంగా మహబూబాబాద్ పార్లమెంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర రాజకీయ పార్టీల విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలను తెలంగాణ రక్షణ సేనలోకి ఆహ్వానించి పార్టీ విస్తరణకు విస్తృత ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.
యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు పార్టీకి ప్రధాన బలంగా మారేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ లక్ష్యాలను ప్రతి ఇంటికీ చేరవేసి, కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు.
డా. బోడ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కేవలం సభ్యత్వ నమోదుతో పూర్తికాదని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం, వారి సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ద్వారానే రాజకీయ పార్టీ బలపడుతుందని అన్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలకు నమ్మకమైన నాయకత్వాన్ని అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీకి బలమైన రాయబారిగా తీర్చిదిద్ది, వారి సేవలకు తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానన్నారు.
తెలంగాణలో రాజకీయ మార్పు కోరుకునే అన్ని వర్గాల ప్రజలను కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ రక్షణ సేనను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గంలో పార్టీ శక్తిని పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పారు.
ప్రజల విశ్వాసమే పార్టీకి అసలైన బలం అనే నమ్మకంతో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ రక్షణ సేనను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు సంపూర్ణ సమయాన్ని అంకితం చేస్తానని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ స్పష్టం చేశారు.
