ఎస్‌ఐఆర్ నమోదులో ప్రతి ఓటు కీలకం.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరామిరెడ్డి పిలుపు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా చేపట్టి, ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా మిస్ కాకుండా చూడాలని నారాయణపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బలరామిరెడ్డి, ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి కర్నే స్వామి సూచించారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటరు నమోదు వివరాలను తెలుసుకుని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై బీఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించారు.

గ్రామంలో 100 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తి చేసిన బీఎల్‌ఓలను శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా బలరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ముఖ్యంగా యువత, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అర్హుల వివరాలు సేకరించడం ద్వారా పూర్తి స్థాయిలో నమోదు సాధ్యమవుతుందని తెలిపారు. ఎవరైనా అర్హులైన ఓటర్లు నమోదు కాకపోతే వెంటనే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి తారా కృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కొండన్ గోపాల్, ఊట్కూర్ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, చిన్నపోర్ల ఉపసర్పంచ్ సంజీవ్, నాయకులు, కార్యకర్తలు సంజీవ్, సహదేవ్, నాగేష్, నరేష్, నరసింహులు, ఎద్దుల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.