ఇంద్రకీలాద్రిపై ‘వేద దివ్య దర్శనం’కు శ్రీకారం
వేద విద్యార్థుల కోసం తొలిసారిగా ప్రత్యేక దర్శన విధానం
ప్రతి పండుగ, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక దర్శనం
వేద పరిరక్షణకు దేవస్థానం వినూత్న నిర్ణయం.. ఈఓ శీనా నాయక్‌కు ప్రశంసలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చరిత్రలో తొలిసారిగా వేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘వేద దివ్య దర్శనం’ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ తీసుకున్న ఈ నిర్ణయంతో పోరంకిలోని దేవస్థాన వేదపాఠశాల విద్యార్థులకు ప్రతి పండుగ, పౌర్ణమి, అమావాస్యతో పాటు అన్ని ప్రధాన పర్వదినాల్లో ప్రత్యేక మార్గంలో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాకంభరి ఉత్సవాల సందర్భంగా ఈ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురాగా, తొలి ఏకాదశి రోజునే ఈ పాలసీకి సంబంధించిన ఫైలుపై ఈఓ శీనా నాయక్ సంతకం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ పాలసీ ద్వారా వేదాలను అభ్యసిస్తున్న విద్యార్థులకు నిరంతర దర్శన సౌకర్యం కల్పించడంతో పాటు వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యమని దేవస్థాన అధికారులు వెల్లడించారు. దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా వేద విద్యార్థుల కోసం ప్రత్యేక దర్శన విధానాన్ని ప్రవేశపెట్టడంపై వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, వేద పండితులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి విశేష పర్వదినంలో ‘వేద దివ్య దర్శనం’ విధానాన్ని నిరంతరాయంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
