దోమలపై ఏఐ అస్త్రం! సరికొత్త టెక్నాలజీతో దోమలకు చెక్
దోమలపై ఏఐ అస్త్రం! సరికొత్త టెక్నాలజీతో దోమలకు చెక్
- ఏఐ ఆధారిత ‘ఫోటాన్ మ్యాట్రిక్స్’ మస్కిటో కిల్లర్
- సోలార్ కిల్లర్లు, అల్ట్రాసోనిక్ గాడ్జెట్లతో దోమల నివారణ
- మస్కిటో రిపెల్లెంట్ దుస్తులు, స్మార్ట్ పరికరాల వినియోగం
- ల్యాంప్స్, హోలోగ్రాఫిక్ ఫ్యాన్స్‌తో ఆధునిక రక్షణ
మానవ జీవితంలో దోమలు పెద్ద సమస్యగా మారాయి. వాటిని నిరోధించేందుకు ఎన్ని కెమికల్స్ వచ్చినా వాటిని కూడా లెక్క చేయకుండా జనంపై దాడి చేస్తున్నాయి. దోమల నివారణకు ఇంట్లో వాడని అస్త్రం లేదు. ఇప్పుడు వీటి నివారణకూ ఏఐ సాంకేతికత అవసరమైంది. తాజాగా దోమలనుంచి రక్షించుకోవడానికి మార్కెట్లోకి **కృత్రిమ మేధ (ఏఐ)**తో పనిచేసే సరికొత్త వస్తువులు, మస్కిటో రిపెల్లెంట్లు వచ్చేశాయి.
ఫోటాన్ మ్యాట్రిక్స్
ఒక్కోసారి కళ్లముందు దోమ మన చుట్టూ తిరుగుతూ విసుగు తప్పిస్తుంది. పోనీ పట్టుకుందామా అంటే అస్సలు దొరకదు. ఇలాంటి సమస్యకు ఫోటాన్ మ్యాట్రిక్స్ మస్కిటో కిల్లర్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరం ఇంట్లో దోమలు ఎక్కడున్నా ఒక్క సెకన్లో వాటిని పట్టి చంపుతుందని చెబుతున్నారు. దీంట్లోని లైడర్ టెక్నాలజీ దోమలు ఎక్కడున్నాయో స్కాన్ చేస్తే, ఏఐ అది దోమ అవునో కాదో విశ్లేషించి ట్రాక్ చేస్తుందట. దీంతో లేజర్ కిరణాలు ఆ దోమని చటుక్కున చంపేస్తాయంటున్నారు. అలా ఈ డివైజ్ గది మొత్తం స్కాన్ చేస్తూ, క్షణాల్లో దోమల బెడదను తగ్గించేస్తుందని, మల్టీ లెవల్ సేఫ్టీ సిస్టమ్తో పనిచేయడం వల్ల మనుషులకు ఎలాంటి హానీ ఉండదంటున్నారు. అలాగే స్మార్ట్ యాప్ కంట్రోల్తో దీన్ని ఇంటి లోపలా, బయటా వాడుకోవచ్చని సూచిస్తున్నారు.
సోలార్ కిల్లర్స్
ఈ మధ్య ప్లేస్ లేక చాలా మంది బెడ్రూమ్, కిచెన్ బాల్కనీల్లో చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. వాటివల్ల దోమలూ ఎక్కువవుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి ఈ సోలార్ బల్బులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆటోమేటిక్‌గా ఇవి రోజంతా సౌరశక్తిని తీసుకుని రాత్రిపూట ఊదా రంగులో వెలుగుతూ దోమల్ని ఆకర్షిస్తాయని, వాటికి చిన్న షాక్ ఇవ్వడంతో అవి అక్కడికక్కడే చనిపోతుంటాయంటున్నారు. ఇలా దోమల్నే కాకుండా, చిన్నచిన్న పురుగుల్నీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయంటున్నారు.
రక్షణవలయంలా ప్రత్యేక దుస్తులు
చలిని తట్టుకోవడానికి స్వెటర్లు, ఉక్కపోతను భరించడానికి కాటన్ దుస్తులు ఎలా వేసుకుంటామో, దోమల నుంచి రక్షణకు కూడా డ్రెస్సులు వచ్చేశాయ్. మస్కిటో రిపెల్లెంట్ చొక్కాలు, ప్యాంట్లు, టోపీలు, సాక్సుల్లాంటివి దొరుకుతున్నాయి. పెర్మెథిన్ అనే రసాయనాన్ని వాడి వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. రకరకాల డిజైన్లలో ఎన్నో సంస్థలు ఈ మస్కిటో షీల్డ్ డ్రెస్సులు తెస్తున్నాయని, దాదాపు 70 సార్లు ఉతికినా దాని ప్రభావం అలాగే ఉంటుందంటున్నారు. దాని వల్ల హానీ కూడా కలగదంటున్నారు. కేవలం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విహారయాత్రల్లో, ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయంటున్నారు.
అల్ట్రాసోనిక్ గాడ్జెట్లు
ఇంట్లో సులువుగా పెట్టుకునేలా రకరకాల అల్ట్రాసోనిక్, డిజిటల్ డిస్ప్లే ఎలక్ట్రిక్ మస్కిటో రిపెల్లెంట్లు చాలానే ఉన్నాయి. వీటిల్లో అల్ట్రాసోనిక్ గ్యాడ్జెట్లు శబ్ద తరంగాలు విడుదల చేస్తూ దోమలను బెదరగొడతాయని, డిజిటల్ డిస్ప్లే ఎలక్ట్రిక్ రిపెల్లెంట్ అయితే ముందే సమయం సెట్ చేస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా పనిచేస్తుందట. సరిగ్గా సాయంత్రానికి ఆన్ అయ్యేలా టైం పెట్టామంటే ఎంచక్కా రోజూ అదే ఆన్, ఆఫ్ అవుతుందంటున్నారు.
రిపెల్లెంట్‌గా స్మార్ట్ వాచ్
సాధారణంగా పెన్ డ్రైవ్‌ను టీవీ, లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని ఇష్టమైన సినిమాలు చూస్తుంటారు. అయితే మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ మస్కిటో రిపెల్లెంట్ హీటర్ యూజ్ చేస్తే దోమలు రావంటున్నారు. దీని లోపల హీటెడ్ మస్కిటో రిపెల్లెంట్ మ్యాట్ ఉంటుందని, ప్లగ్‌లో పెట్టగానే ఇందులోని హీటర్ వేడెక్కి, మ్యాట్‌లో ఉండే దోమల మందును ఆవిరి రూపంలో విడుదల చేస్తుందంటున్నారు. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ యూఎస్‌బీ చుట్టుపక్కలకు దోమలు రావంటున్నారు. ప్రయాణాల్లోనూ ఇది చాలా ఉపయోగం.
హోలోగ్రాఫిక్ ఫ్లై ఫ్యాన్స్
వర్షాకాలంలో ఆహార పదార్థాల మీద దోమలూ, ఈగల్లాంటివి వాలుతుంటాయి. కొన్నిసార్లు మూతలు పెట్టి, పరిసరాల్ని శుభ్రంగా ఉంచినా వాటిని ఆపడం కష్టమే. ఈ ఇబ్బందికి పరిష్కారంగా హోలోగ్రాఫిక్ ఫ్లై ఫ్యాన్స్ వచ్చాయంట. ఇవి వేగంగా తిరుగుతూ హోలోగ్రాఫిక్ కాంతితో వాటిని గందరగోళానికి గురి చేస్తుంటాయని, దీంతో ఈ ఫ్యాన్ల చుట్టుపక్కలకు దోమలూ, ఈగల్లాంటివి రావని నిపుణులు చెబుతున్నారు.
తరిమికొట్టే వెలుగు
గదిలో బెడ్‌లైట్లా పనిచేస్తూనే దోమల్ని తరిమికొట్టడంలో ఎలక్ట్రిక్ మస్కిటో కిల్లర్ ల్యాంప్స్ మెరుగ్గా పనిచేస్తాయంటున్నారు. వీటిల్లో కొన్నేమో దోమల్ని ఆకర్షించే ప్రత్యేకమైన ఊదా రంగు కాంతితో వెలుగుతాయని, ఆ లైట్ వల్ల దోమలు దగ్గరకు రాగానే ఈ ల్యాంప్స్ వాటిని లోపలికి లాక్కుంటాయని, అలా లోపలికి వెళ్లిన దోమలు మళ్లీ బయటకు రాలేవంటున్నారు. అయితే, వాటిని తొలగించడమూ సులువే అని చెబుతున్నారు. ఇక మరికొన్ని లైట్లేమో ఆకర్షించిన దోమలకు విద్యుత్ షాక్ ఇవ్వడం వల్ల అవి కిందపడిపోతుంటాయని వివరిస్తున్నారు.
