ప్రధాన ఆలయాల అభివృద్ధికి ‘టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్’ ప్లాన్
ప్రధాన ఆలయాల అభివృద్ధికి ‘టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్’ ప్లాన్
- 22 ప్రముఖ ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం
- తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ
- ఆధ్యాత్మిక పర్యాటకం, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి
- పురాతన ఆలయాల పునరుద్ధరణ, భజన మందిరాల నిర్మాణానికి ప్రాధాన్యం
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 22 ప్రముఖ ఆలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఇప్పటికే సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయి. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, వసతి, పరిశుభ్రత, భక్తులకు ప్రదక్షిణ మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, శ్రీశైలాన్ని తిరుమల తరహాలో ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. పార్కింగ్, రహదారులు, వసతి, పర్యాటక సదుపాయాల విస్తరణతో పాటు హోమ్‌లు, హోటళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 10 వేల టూరిస్ట్ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తిరుమలలో అమలవుతున్న రద్దీ నిర్వహణ, అన్నప్రసాద పథకాలను ఇతర ప్రధాన ఆలయాలకు విస్తరించనుంది.
రూ.750 కోట్ల శ్రీవాణి నిధులతో రెండు సంవత్సరాల్లో 5 వేల భజన మందిరాల నిర్మాణం, రూ.813 కోట్లతో 692 పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయాల అభివృద్ధిలో పారదర్శకత కోసం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రతి ఆలయానికి ప్రహరీతో కూడిన ప్రమాణిక నమూనాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక ఆలయాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక పర్యాటకం, మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
