హై పవర్ కమిటీతో ఒరిగేదేమిటి? పరీక్షల సంస్కరణలపై సందేహాలు

హై పవర్ కమిటీతో ఒరిగేదేమిటి? పరీక్షల సంస్కరణలపై సందేహాలు

  • పేపర్ లీక్‌లతో దెబ్బతిన్న పోటీ పరీక్షల విశ్వసనీయత
  • ఉద్యోగార్థులు, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళన
  • నందన్ నీలేకని కమిటీపై ఎందుకు అనుమానాలు?
  • వ్యవస్థ మారకపోతే కమిటీలతో ప్రయోజనం ఉంటుందా?

ప్రవేశపరీక్షలకు పేపర్ లీక్ ఘటనలు చీడపురుగుల్లా తయారయ్యాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం విద్యార్థులు వేలకువేలు ఖర్చు చేసి శిక్షణ తీసుకుంటారు. వారు కోచింగ్ కేంద్రాలు ఇచ్చే అంచనా పేపర్లను ఆధారంగా చేసుకుని పరీక్షలకు తయారవుతారు. గత ఐదు, లేదా పది సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా ప్రశ్నలు ఈసారి అడగవచ్చని వారు ఊహామాత్రంగా తమకు తోచిన రీతిలో నమూనాలను తయారుచేసుకుంటారు.

అయితే, వాటిల్లో కొన్ని మాత్రమే వస్తాయని వారికి తెలుసు. అయినప్పటికీ ఐదారు ప్రశ్నలు వచ్చినా చాలని వాటి ఆధారంగా పరీక్షలకు సిద్ధమవుతారు. చాలాకాలంగా అమలులో ఉన్న పద్ధతి ఇది. ఇది పబ్లిక్ పరీక్షలన్నింటికీ వర్తిస్తుంది. కానీ, ఈ మధ్యకాలంలో అచ్చుగుద్దినట్టు ప్రశ్నపత్రాలు తప్పకుండా లీక్ అవుతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు పరీక్షల అధికారులు చర్యలు తీసుకుని ఉంటే విద్యార్థుల్లో అలజడి ఉండేది కాదు.

గడిచిన ఐదారుేళ్లలో జరిగిన పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు ఎన్నో లీక్ అయ్యాయి. వీటిలో ప్రవేశపరీక్షలకు సంబంధించినవే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆయా కేసులలో 1658 మంది అరెస్టయ్యారు. వీరిలో 925 మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలలో అనుమానితులపై కేసులు నమోదు అయినప్పటికీ, వారిలో శిక్షలు పడిన వారు చాలా తక్కువ.

ఈ పరీక్షల్లోనే కాదు, ఇతర ప్రవేశపరీక్షల్లో కూడా దోషులుగా నిర్ధారణ అయినవారికి శిక్షలు పడిన సంఘటనలు అరుదే. అందువల్ల ఉద్యోగార్థుల్లో, పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఈ పరీక్షలపై నమ్మకం పోయింది. అలాగే, ఈ పరీక్షలు రాయడం శుద్ధ దండగ అనీ, తమకు కావలసిన వారిని ముందుగానే ఎంపిక చేసి సీట్లు ఖరారు చేస్తున్నారనే అభిప్రాయం పరీక్షలు రాసేవారిలో నెలకొంటోంది. అయినా ఆశ చావకపోవడం వల్ల పోటీ పరీక్షలకు అభ్యర్థులు హాజరవుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం నందన్ నీలేకని నేతృత్వంలో ఒక హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్న వారంతా ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులు. వారిని తప్పుపట్టడానికి లేదు. అయితే, స్వతంత్ర అభిప్రాయాలను వెల్లడించేందుకు, సూచనలు చేసేందుకు వారికి స్వాతంత్ర్యం ఉండదు. ఇది ఒక విషచక్రం. అందువల్ల ఎంత పెద్ద మేధావులనూ, విద్యావేత్తలతో కమిటీలు వేసినా ఫలితం ఒకే రకంగా ఉంటుంది. ఇది నిరాశావాదం కాదు. మన వ్యవస్థలో వచ్చిన మార్పు.

రెండేళ్ల క్రితం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలో కీలకమైన వ్యక్తిగా పేర్కొనబడిన సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పట్లో సంజీవ్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సమాజంలో పెద్దలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక అందుకు భిన్నంగా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు.