ఇంద్రకీలాద్రి క్లోక్‌రూమ్‌లో అధిక వసూళ్లపై ఈవో సీరియస్..

  • ‘సాల్తీ @30’ కథనంతో కదిలిన దేవస్థానం యంత్రాంగం..
  • లైసెన్సుదారుకు రూ.10 వేల జరిమానా..
  • మూడు రోజుల్లో చెల్లించాలని ఆదేశం
  • ఇప్పటికే ఐదుసార్లు మొత్తం రూ.70 వేల అపరాధ రుసుము..
  • బ్యాగుకు రూ.10కు బదులు రూ.30 వసూలు చేసినట్లు ఆంధ్రప్రభ కథనంతో వెలుగులోకి
  • సంజాయిషీ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని ఈవో శీనా నాయక్ హెచ్చరిక

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని క్లాక్‌రూమ్‌లో భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారంటూ ఆంధ్రప్రభలో సోమవారం ప్రచురితమైన “సాల్తీ @30” కథనంపై దేవస్థానం యంత్రాంగం వెంటనే స్పందించింది.

కథనం ఆధారంగా విచారణ చేపట్టిన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, క్లాక్‌రూమ్ నిర్వహిస్తున్న లైసెన్సుదారు మెస్సర్స్ వాసవి డ్రై ఫ్రూట్స్ యాజమాన్యానికి రూ.10 వేల అపరాధ రుసుము విధిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. టెండర్ నిబంధనల ప్రకారం బ్యాగుకు రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఈవో పేర్కొన్నారు.

దేవస్థానం రికార్డుల ప్రకారం, క్లాక్‌రూమ్ లైసెన్సు 2025 అక్టోబర్ 23 నుంచి 2026 అక్టోబర్ 22 వరకు ఒక సంవత్సరం కాలానికి మంజూరైంది. గతంలోనూ భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారంటూ పలుమార్లు ఫిర్యాదులు రావడంతో లైసెన్సుదారుపై అపరాధ రుసుములు విధించినట్లు నోటీసులో వెల్లడించారు.

ఇప్పటికే ఐదు పర్యాయాలు మొత్తం రూ.70 వేల జరిమానా విధించినప్పటికీ వాటిని చెల్లించకుండా టెండర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని ఈవో పేర్కొన్నారు. ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనంలో బ్యాగుకు రూ.30 వసూలు చేస్తూనే రసీదులో వాస్తవానికి విరుద్ధంగా నమోదు చేస్తున్నారనే అంశాలు ప్రస్తావించబడటంతో దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఈవో అభిప్రాయపడ్డారు.

దీనిపై వెంటనే స్పందిస్తూ తాజా ఘటనకు సంబంధించి మరో రూ.10 వేల అపరాధ రుసుము విధించారు. జారీ చేసిన నోటీసులో, విధించిన రూ.10 వేల జరిమానాను మూడు రోజుల్లోపు చెల్లించాలని, అలాగే టెండర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిన నేపథ్యంలో లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో సహేతుక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

నిర్ణీత గడువులో వివరణ ఇవ్వకపోతే ఎటువంటి తదుపరి నోటీసు లేకుండానే లైసెన్సును రద్దు చేసే చర్యలు తీసుకుంటామని ఈవో వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు. దేవస్థానంలో భక్తులకు పారదర్శకంగా, నిర్ణీత రుసుములతో సేవలు అందించాల్సిన బాధ్యత లైసెన్సుదారులపై ఉందని, నిబంధనల ఉల్లంఘనను ఏమాత్రం ఉపేక్షించబోమని దేవస్థానం వర్గాలు తెలిపాయి.