గడువులోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ

గుంటూరు, ఆంధ్ర‌ప్ర‌భ: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో యూరియా విక్రయాలు, సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా కొరత, అక్రమ నిల్వలు లేదా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు అన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

జిల్లాలో ఎంపిక చేసిన 10 చెరువులను మోడల్ చెరువులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువు గట్టుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, మొక్కలు నాటడం, ప్లే, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ పనులన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గ్రీన్ గుంటూరు క్యాంపెన్ లో భాగంగా ఆగస్టు 15 లోగా 1.2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి మొక్క కు జియో ట్యాగ్ వేయాలని, వాటిని సంరక్షించే బాధ్యత సంబంధిత మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోల దేనని తెలిపారు.

అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బియ్యం నాణ్యతలో ఏ మాత్రం లోపం ఉన్నా వెంటనే సంబంధిత తహసీల్దార్లకు సమాచారం అందించి, నాణ్యత ప్రమాణాల మేరకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎల్ నినో ప్రభావం తో వర్షపాతం అతి తక్కువగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పంటల బీమా పథకంలో రైతులందరూ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు సిసిఆర్ కార్డులు పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు.

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిఆర్ఓ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, డిపిఓ సాయికుమార్, డ్వామా, డి ఆర్ డి ఎ పిడిలు శంకర్, విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.