మోత్కూర్ పీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలి
ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు చేయాలని సీపీఎం ధర్నా
మోత్కూర్, ఆంధ్రప్రభ: శిథిలావస్థకు చేరిన మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవనం నిర్మించి, 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూర్ పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా వైద్యాధికారికి పంపేందుకు స్థానిక వైద్యాధికారి డాక్టర్ నిరోషాకు అందజేశారు.
ఈ సందర్భంగా బొల్లు యాదగిరి మాట్లాడుతూ.. మోత్కూర్ పీహెచ్సీకి ప్రతిరోజు సుమారు 100 నుంచి 120 మంది ఓపీ రోగులు వస్తున్నారని తెలిపారు. అయితే కనీస సౌకర్యాలైన నీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ముగ్గురు వైద్యులు ఉండాల్సిన పీహెచ్సీలో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని, పీహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. దత్తప్పగూడెం, పొడిచేడు గ్రామాల ఏఎన్ఎం పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు.
ప్రసూతి గదులు ఇరుకుగా ఉన్నాయని, దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారని, దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ చూపి శిథిలావస్థలో ఉన్న పీహెచ్సీకి కొత్త భవనం నిర్మించి, 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ల యాదిరెడ్డి, పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, టౌన్ కమిటీ సభ్యులు కందుకూరి నర్సింహా, పిట్టల చంద్రయ్య, పిట్టల కిష్టయ్య, గుండు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
