మల్లన్నగుట్టకు తరలనున్న జుక్కల్ గురుభక్తులు
29న శ్రీ బసవలింగ అవధూత జన్మదినోత్సవం.. భక్తి కార్యక్రమాలకు ఏర్పాట్లు
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: ఝరాసంగం మండలం కుప్పానగర్ చిల్లపల్లిలోని శ్రీ మల్లయ్యగిరి ఆశ్రమం పీఠాధిపతి పరమపూజ్య డాక్టర్ శ్రీ బసవలింగ అవధూత మహాస్వామి జన్మదినోత్సవానికి జుక్కల్ నియోజకవర్గ ప్రాంతంలోని గురుభక్తులు తరలేందుకు సిద్ధమవుతున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో శ్రీ బసవలింగ అవధూత మహాస్వామి శిష్యులు, భక్తులు వేల సంఖ్యలో ఉన్నారు. స్వామివారు తమ ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు, పలువురిని చెడు వ్యసనాలకు దూరం చేస్తూ సన్మార్గంలో నడిపించారని భక్తులు తెలిపారు.
దైవభక్తి పెంపొందించడం, సామాజిక సేవ, ఆరోగ్య పరిరక్షణపై తన దివ్య ప్రవచనాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారని పేర్కొన్నారు.
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ బసవన్న మందిరంలో గురువర్యులు పక్షం రోజుల పాటు యోగా తరగతులు నిర్వహించి భక్తులు, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
లొంగన్ గ్రామానికి చెందిన ఓ గురుభక్తుడు అనారోగ్యానికి గురికాగా, స్వామివారు నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో రోజురోజుకు భక్తులు సద్గురువుల మార్గం వైపు ఆకర్షితులవుతున్నారని భక్తులు తెలిపారు.
జుక్కల్ ప్రాంత ప్రజలు శ్రీ బసవలింగ అవధూతను గురువుగా భావించడమే కాకుండా, భగవంతుడిని చేరుకునే మార్గాన్ని చూపించే దివ్యజ్యోతిగా కొనియాడుతున్నారు.
ఈ నెల 29న గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ మల్లయ్యగిరి ఆశ్రమంలో శ్రీ బసవలింగ అవధూత జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవిత్ర రుద్రాక్షలతో తులాభారం, గురుపూజోత్సవం, గురుదేవుల తొట్టెల మహోత్సవం, ఆశీర్వచనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అదేవిధంగా గురువర్యులు రచించిన ‘అవధూత వైభవం’, ‘అనుభవామృతం’ గ్రంథాలను భక్తుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.
గురుభక్తులు, కుటుంబ సభ్యులు, ఆధ్యాత్మిక సాధకులు గురుదేవుల ఆశీస్సులు పొందుతూ ఈ భక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ మల్లయ్యగిరి ఆశ్రమ నిర్వాహకులు కోరారు.
