మరిపెడ పరిధిలోని తండాల్లో ఉచిత వైద్య శిబిరాలు
రెండు గ్రామపంచాయతీల్లో 155 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
మరిపెడ ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తండాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు.
సోమవారం తానంచెర్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని అజ్మీరా తండా గ్రామపంచాయతీలో, వీరారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని దంటకుంట తండా గ్రామపంచాయతీలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించారు.
ఈ శిబిరాల్లో మొత్తం 155 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల నివారణతో పాటు వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, హెల్త్ సూపర్వైజర్ ఆచార్యులు, ఎంఎల్హెచ్పీ ఝాన్సీ, ఏఎన్ఎంలు రోజమణి, శ్రీలత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
