జిల్లాలో ప్రారంభమైన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘2 ఏళ్ల నమ్మకం… అభివృద్ధి… సంక్షేమం’ కార్యక్రమం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ముందుగానే ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా, మండల, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, బూత్ కన్వీనర్లు, తెలుగుయువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీ విభాగం సహా అనుబంధ సంఘాల ప్రతినిధులు, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, మెగా డీఎస్సీ, రైతులకు అందిస్తున్న సాయాలు, రహదారుల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రత్యేక కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో ప్రారంభం..
పూతలపట్టు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సోమవారం ఐరాల మండలం కాణిపాకం పంచాయతీలో శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. క్లస్టర్ ఇన్చార్జులు, క్లస్టర్ కో-కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులు, కుటుంబ సాధికార సారథులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నామినేటెడ్ పదవుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 45 రోజుల పాటు ప్రతి బూత్ పరిధిలో ప్రతిరోజూ 30 ఇళ్లను సందర్శిస్తూ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రచార కార్యక్రమంగా కాకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా భావించి ప్రతి కార్యకర్త పూర్తి బాధ్యతతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలను కూడా నమోదు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు.
