సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీసీసీబీ బ్యాంక్ మేనేజర్

మరిపెడ, ఆంధ్రప్రభ: అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు లేదా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్రవణ్ కుమార్ సూచించారు. సోమవారం మండలంలోని గుండెపూడి గ్రామంలో వరంగల్ డీసీసీ బ్యాంక్–నాబార్డ్ ఆధ్వర్యంలో ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత, పొదుపు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, కేవైసీ, రీ-కేవైసీతో పాటు రైతులకు అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాల్లోని లింకులను నమ్మవద్దని, బ్యాంకు పేరుతో వచ్చే ఫేక్ కాల్స్‌కు స్పందించవద్దని శ్రవణ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు సిబ్బంది, పీఏసీఎస్ కార్యదర్శి, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.