Rain| ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగ్అవుట్ సూచన
Rain| ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగ్అవుట్ సూచన
భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ
విడతల వారీగా ఉద్యోగులను పంపాలని ఐటీ కంపెనీలకు సూచనలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు విడతల వారీగా ఎర్లీ లాగ్అవుట్ (Early Logout) కల్పించాలని సూచించారు.
పోలీసుల సూచనల ప్రకారం, ఒకేసారి ఉద్యోగులందరూ కార్యాలయాల నుంచి బయటకు రాకుండా దశలవారీగా లాగ్అవుట్ సమయాలను నిర్ణయించాలని కంపెనీలను కోరారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ నిర్వహణ సులభతరం కావడంతో పాటు వర్షాల సమయంలో ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, ఇతర అత్యవసర సేవల వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ చర్యలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఐటీ కంపెనీలు తమ కార్యాలయాల వివరాలు, ఉద్యోగుల లాగ్అవుట్ సమయాలను ముందుగానే ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన రహదారులపై అప్రమత్తంగా ప్రయాణించాలని నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
