YSRCP | మాజీ మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న!

YSRCP | మాజీ మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న!

YSRCP | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా రక్షణ అట్టడుగుకు పడిపోయిందని, కూటమి నేతలే మహిళలను వేధిస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటోందని ఆమె మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే వేధింపులకు పాల్పడుతున్నారని రజిని ఆరోపించారు. మహిళలకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

“గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం చేశారు. మరి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఈ కూటమి ప్రభుత్వం ఎంతమందిని గుర్తించి, రక్షించిందో చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు.

మిస్ అయిన వారిని ఏపీకి తిరిగి తీసుకువచ్చారా? గత రెండేళ్లుగా ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆమె ప్రశ్నించారు. కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఈ అబద్ధపు ప్రచారాలు చేశారని విమర్శించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, అప్పటి ఆయన ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు.

అధికారంలోకి రాక ముందు మహిళా రక్షణ గురించి గొప్పలు చెప్పిన వారు, ఇప్పుడు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గేది లేదని విడదల రజిని స్పష్టం చేశారు.

Leave a Reply