వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్ రూ.50 వేల విరాళం
ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని రజక సంఘం విజ్ఞప్తి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వినాయక ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ పునర్నిర్మాణానికి రజక సంఘం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, దాతలు ముందుకు వస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా భీమ్‌గల్ మున్నూరు కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధులు రజక సంఘం సభ్యులకు విరాళం చెక్కును అందించి ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మున్నూరు కాపు ఫౌండేషన్ భాగస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు.
రజక సంఘం నాయకులు మున్నూరు కాపు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజంలోని దాతలు, భక్తులు కూడా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం రవి, బోదిరే నర్సయ్య, తేజ, చరణ్, అరవింద్, నవీన్, ప్రదీప్, సతీష్, విశాల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
