ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యం

  • పబ్లిక్ గ్రీవెన్స్‌లో 62 ఫిర్యాదులు
  • స్వ‌యంగా స్వీక‌రించిన ఏలూరు ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్

ఏలూరు, ఆంధ్ర‌ప్ర‌భ: ప్ర‌జ‌ల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్ రావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా కలిసి వారి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆధునిక సాంకేతికతతో ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా నిర్వహించడం విశేషం.

ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 62 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం నిష్పక్షపాత విచారణ చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే విచారణ నివేదికలను నిర్ణీత గడువులో సమర్పించాలని సూచించారు.

ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమకు సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు “మీకోసం” (Meekosam) పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఫిర్యాదుల స్థితిగతులు, పురోగతిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు కల్పించారు.