kcr| సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్న గులాబీ బాస్
kcr| సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్న గులాబీ బాస్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిని సందర్శించనున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో తొలుత స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గ్రీన్ ఛానల్ సౌకర్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ మొదటి నుంచే ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న కేసీఆర్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు ఇప్పటికే సూచించినట్లు సమాచారం.
