ఆర్టీసీ బస్సు రూట్ మార్పుపై గ్రామాల ఆగ్రహం

పాత మార్గంలోనే బస్సు నడపాలని డిమాండ్.. లేకుంటే ఆందోళన హెచ్చరిక

కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కాల్వ శ్రీరాంపూర్–జమ్మికుంట నుంచి గోదావరిఖనికి ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ బస్సు రూట్‌ను ఆకస్మికంగా మార్చడంపై గుంపుల, మీర్జంపేట, కిష్టంపేట, మొట్లపల్లి గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత వారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దరాతుపల్లి గ్రామంలో ఈ బస్సు సేవలను ప్రారంభించారు. తొలి రెండు రోజులపాటు బస్సు గుంపుల, మీర్జంపేట, కిష్టంపేట, మొట్లపల్లి గ్రామాల మీదుగా యథావిధిగా నడిచింది. దీంతో గ్రామాల ప్రజలు ఉపాధి, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం గోదావరిఖని, జమ్మికుంట పట్టణాలకు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించారు.

అయితే అనంతరం ఆర్టీసీ అధికారులు బస్సు రూట్‌ను మార్చి మల్యాల–తారుపల్లి మీదుగా నడుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గుంపుల, మీర్జంపేట, కిష్టంపేట, మొట్లపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఈ గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన బస్సునే వేరే మార్గంలో నడపడం వెనుక కొందరు నాయకుల ఒత్తిడి ఉందని స్థానికులు ఆరోపించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుంపుల–మీర్జంపేట–కిష్టంపేట–మొట్లపల్లి మీదుగా గోదావరిఖని–జమ్మికుంటకు ఆర్టీసీ బస్సును యథావిధిగా నడపాలని గ్రామస్థులు అధికారులను కోరారు. అవసరమైతే మల్యాల–తారుపల్లి గ్రామాలకు ప్రత్యేకంగా మరో బస్సును ఏర్పాటు చేయాలని సూచించారు.

తక్షణమే పాత రూట్‌ను పునరుద్ధరించకపోతే గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.