విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు

భట్టి విక్రమార్క

ఉచితాలు కాదు..

ప్రజలపై ప్రభుత్వ పెట్టుబడులే..

మధిరలో అల్పాహార పథకానికి శ్రీకారం

మధిర, ఆంధ్రప్రభ : ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడులేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఉచిత పథకాలపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందని పేర్కొన్నారు.

సోమవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయం వేళ రుచికరమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.

బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆకలితో పాఠశాలకు వచ్చే విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మానవ వనరులే రాష్ట్రానికి అసలైన సంపద అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సహజ వనరులు ఎంత ముఖ్యమో, సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమన్నారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను సానబెట్టిన వజ్రాల్లా తీర్చిదిద్ది రాష్ట్రానికే కాకుండా దేశానికి, ప్రపంచానికీ దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఒకే సమయంలో వేడివేడిగా అల్పాహారం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 7 లక్షల మంది విద్యార్థులకు ఒకే సమయంలో అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమమని పేర్కొన్నారు.

హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల పాఠశాలలకు వాహనాల ద్వారా అల్పాహారం పంపిణీ చేస్తున్నామని, రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.

విద్యార్థులకు అల్పాహారంతో పాటు వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తున్నామని తెలిపారు. బడి పిల్లలతో కలిసి భోజనం చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని సంతృప్తిని ఇచ్చిందన్నారు.

పాలన అంటే పెత్తనం కాదని, సమాజ హితం కోసం వనరులను వినియోగిస్తూ ప్రజల అభివృద్ధికి పునాదులు వేయడమే నిజమైన పాలన అని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని పేదల కోసం రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని తెలిపారు. ఆ సమయంలో ఏర్పడిన ఆలోచనలే నేడు ప్రజాహిత పథకాల రూపంలో అమలవుతున్నాయని చెప్పారు.

మొదటి విడతలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.67 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని వెల్లడించారు.

పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, కోటి 6 లక్షల కుటుంబాలకు ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లను నేరుగా జమ చేశామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.