‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు ఎంట్రీ.. గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన వెంకటేష్

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్‌డెస్క్ : విక్టరీ వెంకటేష్ హిరోగా మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా నుంచి చిత్రబృందం కొత్త గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర పేరు ‘చిట్టిబాబు’ అని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకటేష్‌ను చాలా సహజంగా, పూర్తి కుటుంబ నేపథ్యానికి దగ్గరగా ఉండే పాత్రలో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

గ్లింప్స్‌లో చిట్టిబాబు పాత్రకు సంబంధించిన చిన్న పరిచయం మాత్రమే ఇచ్చినప్పటికీ, ఆయన పాత్రలో వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఈ పాత్రను రూపొందించినట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా విడుదలైన ‘చిట్టిబాబు’ గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది. దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సినిమా అక్టోబ‌ర్ 2 న సినిమా విడుద‌ల కానుంది.