రైతు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ బాధ్యత

దాసరి మనోహర్ రెడ్డి

కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్నా సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువులను ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. కొందరు ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మొక్కజొన్న పంటను విక్రయించిన రైతులకు వర్ధన్ సంస్థ నుంచి రావాల్సిన చెల్లింపులు ఇప్పటికీ అందలేదని పేర్కొన్నారు. బకాయిలు పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ వెంటనే చెల్లింపులు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతు సంక్షేమం గురించి ప్రభుత్వం మాటల్లోనే చెబుతోందని, క్షేత్రస్థాయిలో రైతులు సాగునీరు, విద్యుత్, ఎరువులు, పంటల చెల్లింపుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అనంతరం రైతు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు అందజేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.